Home తెలంగాణ అమరావతి నిర్మాణంపై చంద్రబాబు ఫోకస్‌.. స్పీడ్‌, క్వాలిటీ, డెలివరీపై కీలక ఆదేశాలు!

అమరావతి నిర్మాణంపై చంద్రబాబు ఫోకస్‌.. స్పీడ్‌, క్వాలిటీ, డెలివరీపై కీలక ఆదేశాలు!

0

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతిని కేవలం 29 గ్రామాలకే పరిమితం చేయకుండా విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుకొని సమగ్ర రాజధానిగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

రాజధాని అభివృద్ధి పనులపై మంగళవారం సచివాలయంలో సీఆర్డీఏ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించిన ఆయన.. ‘స్పీడ్‌, క్వాలిటీ, డెలివరీ’ అనే మూడు అంశాలను ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని నిర్మాణ పనులు ముందుకు సాగాలని ఆదేశించారు.

జాప్యానికి తావులేదు

రాజధాని నిర్మాణ పనుల్లో గతంతో పోలిస్తే వేగం పెరిగిందని, అయితే ఇంకా వేగం పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా పూర్తి సహకారం అందిస్తోందని, నిధుల కొరత కారణంగా పనులు ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు.

రాజధాని నిర్మాణం కాంట్రాక్టు సంస్థలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన అవకాశమని, పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

నెలకు 7.92 శాతం పనులు పూర్తి చేయాలి

ప్రస్తుతం రాజధాని పరిధిలో రూ.50,999 కోట్ల విలువైన 95 ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి నెల కనీసం 7.92 శాతం పనులు పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వెల్లడించారు.

భూసేకరణ, నిధుల సమీకరణ, ప్రభుత్వ అనుమతులు, డిజైన్ల ఆమోదం వంటి అంశాల్లో శాఖల మధ్య సమన్వయం మరింత పెంచాలని సీఎం ఆదేశించారు. రహదారుల నిర్మాణంతో పాటు రాజధానిలో పచ్చదనాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

ఇకపై చంద్రబాబు స్వయంగా పర్యవేక్షణ

అమరావతి నిర్మాణ పనుల పురోగతిని ఇకపై తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీంతో రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version