Home జాతీయం ఏపీకి భారీ వర్షాల ముప్పు.. తీరానికి చేరువైన తీవ్ర వాయుగుండం

ఏపీకి భారీ వర్షాల ముప్పు.. తీరానికి చేరువైన తీవ్ర వాయుగుండం

0

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర కోస్తాంధ్ర తీరానికి అత్యంత చేరువైంది. రానున్న కొన్ని గంటల్లోనే ఇది తీరం దాటే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం గత ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. బుధవారం సాయంత్రం 5:30 గంటల సమయానికి ఇది కళింగపట్నానికి నైరుతి దిశగా సుమారు 30 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఈశాన్యంగా దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

కొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం

తీవ్ర వాయుగుండం రానున్న 3 నుంచి 4 గంటల్లో విశాఖపట్నం, ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్య.. కళింగపట్నానికి సమీపంలో ఉత్తరాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో తీరం వెంబడి గాలుల వేగం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

వాయుగుండం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని, కొన్ని సందర్భాల్లో గాలి వేగం గంటకు 70 కిలోమీటర్ల వరకు చేరవచ్చని తెలిపింది.

రాయలసీమలోనూ వర్షాలు

తీవ్ర వాయుగుండం ప్రభావం రాయలసీమపై కూడా కనిపించనుంది. రాయలసీమలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని ఐఎండీ పేర్కొంది.

వాయుగుండం తీరం దాటిన తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24 తర్వాత వర్షాల తీవ్రత తగ్గే అవకాశమున్నప్పటికీ, మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు సూచించారు.

మూడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నం, మన్యం, విజయనగరం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version