Home తెలంగాణ కారు డిక్కీలో మహిళ మృతదేహం.. దుర్వాసనతో బయటపడిన దారుణ హత్య

కారు డిక్కీలో మహిళ మృతదేహం.. దుర్వాసనతో బయటపడిన దారుణ హత్య

0

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు డిక్కీ తెరిచి చూడగా.. అందులో మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో ఇది హత్యగా తేలింది.

డీసీపీ దారా కవిత వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలానికి చెందిన వినోద్ కుమార్ కరీంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాజేశం కుమార్తె అంకితి మానస (38)తో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొంతకాలానికి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి కరీంనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మానస ఐదు రోజుల క్రితం తాను తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు, తండ్రికి చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అనంతరం కరీంనగర్‌లో వినోద్ కుమార్ వద్దకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నెల 19న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సమయంలో ఆగ్రహానికి గురైన వినోద్ కుమార్ మానసను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని రహస్యంగా తరలించి ఖననం చేయాలని ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.

మృతదేహాన్ని తరలించేందుకు వినోద్ ఉపయోగించిన కారు ఎల్కతుర్తికి చెందిన తుంగళ్లపల్లి సురేందర్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆ కారును సురేందర్ సమ్మిరెడ్డి వద్ద రూ.2 లక్షలకు తాకట్టు పెట్టగా, ప్రస్తుతం అది వినోద్ కుమార్ వద్ద ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

మానస మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచిన వినోద్.. దాన్ని ఎల్కతుర్తికి తీసుకువచ్చాడు. బస్టాండ్ సమీపంలోని తన ఇంటి పరిసరాల్లో కారును పార్క్ చేశాడు.

అయితే, ఈ నెల 20న కారు నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు డిక్కీ తెరిచి చూడగా మృతదేహం బయటపడింది. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం మానసదేనని గుర్తించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న మానస తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version