Home తెలంగాణ వైభవ్‌కు అసలు పరీక్ష అక్కడే.. న్యూజిలాండ్‌ కోచ్‌ వాల్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

వైభవ్‌కు అసలు పరీక్ష అక్కడే.. న్యూజిలాండ్‌ కోచ్‌ వాల్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

0

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి అసలు పరీక్ష ఎదురుకానుందా? బౌన్సీ పిచ్‌లపై అతడి బ్యాటింగ్‌ను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు న్యూజిలాండ్‌ ప్రధాన కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ తెలిపాడు. అంతేకాదు.. ఓ కోచ్‌గా వైభవ్‌ను కాస్త ఒత్తిడిలో చూసి, అలాంటి పరిస్థితులను అతడు ఎలా ఎదుర్కొంటాడో తెలుసుకోవాలని రహస్యంగా కోరుకుంటున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌ 2025, 2026 సీజన్లలో విధ్వంసక బ్యాటింగ్‌తో వైభవ్‌ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌లోనూ సత్తా చాటాడు. దాంతో జులైలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20లు, జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడికి చోటు దక్కలేదు. అక్టోబర్‌ 22 నుంచి న్యూజిలాండ్‌తో భారత్‌ ఐదు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌లో వైభవ్‌కు అవకాశం వస్తే.. న్యూజిలాండ్‌ సీమ్‌ అనుకూల పరిస్థితుల్లో అతడి ఆటకు గట్టి పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది.

“బౌన్సీ వికెట్లపై వేగంగా వచ్చే బంతులను వైభవ్‌ ఎలా ఎదుర్కొంటాడో చూడాలని ఉంది. ఐపీఎల్‌లో ప్రపంచ స్థాయి బౌలర్లపై అతడు ఆధిపత్యం చెలాయించడం చూశాం. ఇప్పుడు భిన్నమైన పరిస్థితుల్లో అది ఎలా మారుతుందో చూడాలి. మా పరిస్థితుల్లో అతడికి ఎలా బౌలింగ్‌ చేయాలో కూడా ఆలోచించాలి. ఓ కోచ్‌గా రహస్యంగా ఆటగాళ్లను కాస్త ఒత్తిడిలో చూడాలని అనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో వారు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఉంటుంది” అని వాల్టర్‌ చెప్పారు.

భారత్‌తో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమేనని వాల్టర్‌ అన్నారు. స్వదేశంలో ప్రపంచకప్‌ విజేత భారత్‌తో ఐదు టీ20లు ఆడటం తమ ఆటగాళ్లకు మంచి అవకాశమని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో ఎదురైన ఓటమి గురించి స్పందిస్తూ.. అది ఉన్నప్పటికీ ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన లేదన్నారు. న్యూజిలాండ్‌ తరఫున గర్వంగా ఆడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు ప్రణాళిక ఇప్పటికే స్పష్టంగా ఉందని వాల్టర్‌ తెలిపారు. రాబోయే ఏడాదిన్నరలో అవసరమైన చిన్న మార్పులు మాత్రమే చేస్తామని చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version