సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు ఆలయం పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పరిమితులు అమల్లో ఉంటాయని ప్రకటించారు.
ఆగస్టు 1 అర్ధరాత్రి నుంచి ఆగస్టు 4 ఉదయం 3 గంటల వరకు పాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బలా, బైబిల్ హౌస్, ఘస్‌మండి వంటి కీలక జంక్షన్లలో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.
జాతరకు వచ్చే భక్తుల కోసం హరిహర కళాభవన్, మహబూబ్ కాలేజీ, సీఎంఆర్ మాల్, జింఖానా గ్రౌండ్, వెస్లీ కాలేజీ, యశోద హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
అత్యవసర ట్రాఫిక్ సమాచారం కోసం 9010203626 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.
