Home తెలంగాణ హైదరాబాద్ జూ పార్క్ సందర్శకులకు షాక్.. ఆగస్టు 1 నుంచి టికెట్ ధరలు పెంపు

హైదరాబాద్ జూ పార్క్ సందర్శకులకు షాక్.. ఆగస్టు 1 నుంచి టికెట్ ధరలు పెంపు

0

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శకులకు తెలంగాణ జూస్ అండ్ పార్క్స్ అథారిటీ (TZAP) కీలక ప్రకటన చేసింది. జూ పార్క్ ప్రవేశ రుసుముతో పాటు సఫారీ, బ్యాటరీ వాహనాలు, టాయ్ ట్రైన్, అక్వేరియం తదితర సేవల ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

తాజా నిర్ణయం ప్రకారం పెద్దలకు ప్రవేశ టికెట్ ధర రూ.100 నుంచి రూ.120కి, పిల్లలకు రూ.50 నుంచి రూ.60కి పెరిగింది. దీంతో కుటుంబ సమేతంగా జూ పార్క్‌ను సందర్శించే వారికి అదనపు భారం పడనుంది.

జూలో అత్యంత ఆదరణ పొందే సఫారీ సేవల ధరలు కూడా పెరిగాయి. ఏసీ సఫారీ టికెట్ రూ.150 నుంచి రూ.165కి, నాన్-ఏసీ సఫారీ రూ.100 నుంచి రూ.110కి పెరిగింది.

అలాగే బ్యాటరీ వాహనాల్లో ప్రయాణించేందుకు పెద్దలకు రూ.120 నుంచి రూ.135కి, పిల్లలకు రూ.70 నుంచి రూ.75కి ఛార్జీలు పెంచారు. టాయ్ ట్రైన్ టికెట్ ధరను పెద్దలకు రూ.80 నుంచి రూ.90కి, పిల్లలకు రూ.40 నుంచి రూ.45కి సవరించారు.

ఇక ఫిష్ అక్వేరియం టికెట్ రూ.20 నుంచి రూ.25కి, రెప్టైల్ హౌస్ టికెట్ పెద్దలకు రూ.35, పిల్లలకు రూ.15గా నిర్ణయించారు. రాత్రిపూట సంచరించే జంతువులను వీక్షించే నాక్టర్నల్ యానిమల్ హౌస్ టికెట్ ధర పెద్దలకు రూ.25, పిల్లలకు రూ.15గా ఖరారు చేశారు.

ఈ చార్జీల పెంపు నిర్ణయం గత జూలై 13న అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జరిగిన తెలంగాణ జూస్ అండ్ పార్క్స్ అథారిటీ 15వ పాలకమండలి సమావేశంలో తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version