బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ భారత పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్రపతి భవన్ తొలుత ప్రకటన విడుదల చేసి, కొద్ది గంటల్లోనే దాన్ని ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆగస్టు 23 నుంచి 25 వరకు తారిఖ్ రెహమాన్ భారత్‌లో పర్యటించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఆయన పర్యటనపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
మరోవైపు, భారత్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు ఇతర నిందితులను అప్పగించే అంశంలో భారత ప్రభుత్వ స్పందన కోసం బంగ్లాదేశ్ ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే తారిఖ్ రెహమాన్ పర్యటన ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్‌లో ఉన్న షేక్ హసీనా.. త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళ్తానని ఇటీవల ప్రకటించారు. ఆమె మీడియా సమావేశాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ను కోరుతోంది. అయితే, ఈ అంశంపై భారత్ ఇప్పటివరకు ఆచితూచి స్పందిస్తోంది.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు తారిఖ్ రెహమాన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పర్యటనపై నెలకొన్న అనిశ్చితి బ్రిక్స్ సదస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.




