Home తెలంగాణ గుండ్లపోచంపల్లిలో డోర్ నంబర్ వెనుక దాగిన షెడ్ల కథ…!

గుండ్లపోచంపల్లిలో డోర్ నంబర్ వెనుక దాగిన షెడ్ల కథ…!

144
0
  • గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లో కమర్షియల్ షెడ్ల నిర్మాణాలపై అనేక ప్రశ్నలు..
  • అధికారుల తీరుపై స్థానికుల్లో అనుమానాలు

గుండ్లపోచంపల్లి: ఒకవైపు అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని అధికారులు చెబుతుంటే.. మరోవైపు నిర్మాణాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లో వినిపిస్తున్నాయి.

సాధారణంగా ఓ నిర్మాణం చేపట్టాలంటే నిబంధనల ప్రకారం అనుమతులు ఉండాలి. నిర్మాణం పూర్తయిన తర్వాతే సంబంధిత ప్రక్రియల ద్వారా ఆస్తికి గుర్తింపు లభించాలి. కానీ గుండ్లపోచంపల్లి పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ షెడ్లకు డోర్ నంబర్లు ఎలా వచ్చాయి? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

షెడ్ కట్టారా.. డోర్ నంబర్ వచ్చిందా?

స్థానికుల ఆరోపణల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ అవసరాల కోసం షెడ్లు నిర్మించబడుతున్నాయి. ఆ నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయి అనుమతులు ఉన్నాయా? భవన నిర్మాణ నిబంధనలు పాటించారా? అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే కొన్ని షెడ్లకు డోర్ నంబర్లు కేటాయించబడుతున్నాయనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

అసలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలకు డోర్ నంబర్లు కేటాయించారా? లేక అన్ని నిబంధనలు పరిశీలించిన తర్వాతే నంబర్లు ఇచ్చారా? ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.

అధికారులు మారుతున్నారు.. కానీ వ్యవస్థ మాత్రం మారడం లేదు..!

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వస్తోంది. అధికారులు మారుతున్నా.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొంతమంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మాత్రం కొనసాగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో నిర్మాణాలపై ఫీల్డ్ స్థాయి సమాచారం ఎవరు ఇస్తున్నారు? ఆ సమాచారాన్ని అధికారులు ఎలా ధృవీకరిస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఇచ్చే ఫీల్డ్ రిపోర్ట్‌నే ఆధారంగా చేసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే అనుమానాలను కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకున్నా.. తెల్లవారేసరికి మళ్లీ నిర్మాణమా?

అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ.. ఆ చర్యలు ఎంతకాలం నిలుస్తున్నాయన్నది మరో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అధికారులు వచ్చి చర్యలు తీసుకున్న తర్వాత పరిస్థితి కొంతసేపు ప్రశాంతంగా కనిపించినా, మళ్లీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఇలా అయితే అధికారుల చర్యలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందా?

కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగుతున్న నిర్మాణాలకు సంబంధించి పన్నులు, అనుమతులు, ఫీజులు తదితర అంశాల్లో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సక్రమంగా వస్తుందా లేదా అన్నదీ పరిశీలించాల్సిన అంశమే. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగి ఉంటే వాటిపై అధికారులు ఎందుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నకు సమాధానం అవసరం.

పైస్థాయి అధికారులు దృష్టి సారించాల్సిందే!

గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లోని అనుమానాస్పద కమర్షియల్ నిర్మాణాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తోంది. ప్రతి షెడ్‌కు సంబంధించిన నిర్మాణ అనుమతి.. ప్లాన్.. డోర్ నంబర్ కేటాయింపు.. ప్రాపర్టీ ట్యాక్స్.. కమర్షియల్ వినియోగ అనుమతి వంటి అంశాలను పరిశీలిస్తే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

నిబంధనలు ఉల్లంఘించి ఉంటే చర్యలు తీసుకుంటారా?

డోర్ నంబర్ల కేటాయింపులో తప్పిదం జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు ఉంటాయా? అక్రమ నిర్మాణాలను అడ్డుకునే వ్యవస్థలోనే లోపాలు ఉంటే వాటిని సరిదిద్దేది ఎవరు? ఇప్పుడు గుండ్లపోచంపల్లి 299 డివిజన్‌లో ఇవే ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి.

అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత? అధికారుల రికార్డుల్లో ఏముంది? డోర్ నంబర్లు ఏ ప్రాతిపదికన కేటాయించారు? ఈ అంశాలపై అధికారిక రికార్డులు, సంబంధిత అధికారుల స్పందన వెలుగులోకి వస్తేనే పూర్తి వాస్తవాలు స్పష్టమవుతాయి.

— టీజీఎన్ ఛానల్ ప్రత్యేక కథనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here