TGN NEWS (పటాన్‌చెరు): డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు విద్యార్థినుల సందడి నడుమ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి వారి సతీమణి శ్రీమతి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ”బతుకమ్మ పూల పండుగ మాత్రమే కాదు, ప్రకృతిని, భూమిని, నీటిని పూజించే అరుదైన పండుగ. ఇది తెలంగాణ మహిళల ఆనందానికి, ఐక్యతకు ప్రతీక.” అని పేర్కొన్నారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను నిమజ్జనం చేస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అందమైన రూపాన్ని చూపించారు. మహిళలందరికీ పేద–ధనిక తేడా లేకుండా ఒకే వేదికగా కలుపుకునే పండుగగానే బతుకమ్మ ప్రత్యేకతను గుర్తు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ –“భాద్రపద అమావాస్య నుండి ప్రారంభమై తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ పండుగ, తెలంగాణ సాంప్రదాయాలకు అద్దం పట్టే వేడుక” అని అన్నారు. ముఖ్య అతిథి శ్రీమతి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి గారికి కళాశాల వర్గాలు శాలువాతో ఘన సత్కారం అందజేశాయి. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్, కల్చరల్ కమిటీ సభ్యులు, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది ఉత్సవాల్లో పాల్గొని బతుకమ్మ సంబరాలను మరింత అందంగా తీర్చిదిద్దారు.



