Home తెలంగాణ పార్టీ పేరు మార్చాలంటూ ఈసీ ఆదేశం.. ఘాటుగా స్పందించిన కవ

పార్టీ పేరు మార్చాలంటూ ఈసీ ఆదేశం.. ఘాటుగా స్పందించిన కవ

0

పార్టీ పేరు మార్చాలంటూ ఈసీ ఆదేశం.. ఘాటుగా స్పందించిన కవిత

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీతో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆమె సమర్పించిన దరఖాస్తుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చినట్లు ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో పార్టీ పేరును మార్చాలని సూచిస్తూ కవితకు అధికారిక లేఖ పంపింది.

పార్టీ నమోదు ప్రక్రియ కొనసాగాలంటే 15 రోజులలోపు మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా ప్రత్యామ్నాయ పేర్లు అందించకపోతే, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దరఖాస్తును మూసివేస్తామని హెచ్చరించింది.

అయితే, ఈసీ ఆదేశాలపై కవిత తీవ్రంగా స్పందించారు. అభ్యంతరాలకు సంబంధించి తమ వాదనలను ఇప్పటికే రాతపూర్వకంగా ఎన్నికల సంఘానికి సమర్పించామని తెలిపారు. ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను పంపే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతోనే తమ రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని కవిత వెల్లడించారు. అవసరమైతే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తామని, పార్టీ పేరు కోసం న్యాయపోరాటానికి కూడా వెనుకాడబోమని పేర్కొన్నారు.

కొత్త పార్టీ నమోదు కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కవిత ఎన్నికల సంఘానికి ఐదు పేర్లను ప్రతిపాదించారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’, ‘తెలంగాణ జాగృతి’, ‘తెలంగాణ రక్షణ సేన’, ‘తెలంగాణ రాష్ట్ర జాగృతి’, ‘తెలంగాణ ప్రజా శక్తి’ పేర్లను పరిశీలించాలని కోరారు.

ఏప్రిల్ 25న మునీరాబాద్‌లో జరిగిన భారీ సభలో తమ పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని కవిత ప్రకటించారు. అదే కార్యక్రమంలో పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. అయితే, ఆ తర్వాత మూడు రోజులకే పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’గా మార్చారు.

ఏప్రిల్ 28న కొత్త పార్టీ పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు కోరుతూ పత్రికల్లో ప్రకటన విడుదల చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరు నుంచి ‘తెలంగాణ రక్షణ సేన’గా మార్పు వెనుక కారణాలపై అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

ప్రస్తుతం ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో కవిత ప్రజా సమస్యలపై కార్యక్రమాలు నిర్వహిస్తూ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఈ తరుణంలో పార్టీ పేరుపై భారీగా అభ్యంతరాలు రావడం, ఈసీ ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని ఆదేశించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. చివరికి కవిత అదే పేరును నిలబెట్టుకుంటారా? లేక కొత్త పేరుతో ముందుకు సాగుతారా? అన్నది చూడాల్సి ఉంది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version