Home తెలంగాణ ఖాకీల్లో కఠినత్వమే కాదు.. మనసులో మానవత్వం కూడా ఎక్కువే.. తోటి ఎస్సై కుటుంబానికి రూ.25 లక్షల...

ఖాకీల్లో కఠినత్వమే కాదు.. మనసులో మానవత్వం కూడా ఎక్కువే.. తోటి ఎస్సై కుటుంబానికి రూ.25 లక్షల అండగా నిలిచిన రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు

0

సూర్యాపేట: పోలీస్ అంటే నేరస్థులపై ఉక్కుపాదం, చట్టం ముందు రాజీలేని తీరు, కఠిన నిర్ణయాలు మాత్రమే చాలామందికి గుర్తుకు వస్తాయి. కానీ ఆ ఖాకీ చొక్కా వెనుక మానవత్వంతో నిండిన హృదయం కూడా ఉంటుందని మరోసారి నిరూపించారు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు. తోటి సహోద్యోగి మరణంతో ఒంటరైన కుటుంబానికి అండగా నిలిచి, నిజమైన సహచరులంటే ఎలా ఉండాలో ఆదర్శంగా చూపించారు.

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన జి. వెంకటనారాయణ 2014లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై తెలంగాణ పోలీసు శాఖలో సేవలను ప్రారంభించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన ఆయన, కీసర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో క్యాన్సర్ బారిన పడ్డారు. నెలల తరబడి ప్రాణాంతక వ్యాధితో పోరాడిన వెంకటనారాయణ చివరకు ఈ ఏడాది మే 19న కన్నుమూశారు.

ఆయన మరణంతో భార్య, ఇద్దరు చిన్నారులు, వృద్ధ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 2014 బ్యాచ్ ఎస్సైలు మానవత్వంతో ముందుకొచ్చారు.

ఎవరి ఆదేశం లేకుండా, ఎలాంటి అధికారిక కార్యక్రమం కాకుండా.. కేవలం సహచరుడి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో 746 మంది ఎస్సైలు స్వచ్ఛందంగా విరాళాలు అందించారు. వారి చిన్నచిన్న చేయూతలు కలసి రూ.25 లక్షల సహాయంగా మారాయి.

ఈ నిధిలో నుంచి వెంకటనారాయణ ఇద్దరు కుమారుల పేరుపై చెరో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు, ఆయన వృద్ధ తల్లిదండ్రులకు రూ.5 లక్షలు అందజేశారు. బేతవోలు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో చెక్కులను కుటుంబ సభ్యులకు అందిస్తూ, “మీరు ఒంటరివారు కాదు.. మేమంతా మీ కుటుంబమే” అనే సందేశాన్ని ఇచ్చారు.

ఈ ఘటన అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. సహచరుడి కుటుంబానికి అండగా నిలిచిన పోలీసుల సేవాభావం, మానవత్వం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. బంధుత్వాలే దూరమవుతున్న ఈ కాలంలో, కలిసి పనిచేసిన సహోద్యోగి కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి చేయూత అందించిన ఖాకీల చర్య అందరి ప్రశంసలు అందుకుంటోంది.

పోలీస్ అంటే కేవలం చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ మాత్రమే కాదని.. అవసరమైనప్పుడు మానవత్వంతో అండగా నిలిచే కుటుంబమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version