Home జాతీయం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ యువతి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ యువతి మృతి

0

ఉజ్వల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ తెలుగు యువతి జీవితం రోడ్డు ప్రమాదం రూపంలో విషాదాంతమైంది. పల్నాడు జిల్లాకు చెందిన మక్కెన ప్రసన్న (27) అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటనతో ఆమె స్వగ్రామం ఉమ్మడివరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన రైతు దంపతులు మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మల పెద్ద కుమార్తె ప్రసన్న. 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆమె, ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో మంగళవారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ కార్యక్రమానికి కారులో వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె స్నేహితులు గాయపడ్డారు.

కుమార్తె మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.. ప్రసన్న తండ్రితో ఫోన్‌లో మాట్లాడి వారిని ఓదార్చారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తరలించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. తమ కుమార్తె భౌతికకాయాన్ని త్వరగా రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version