తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యేలకు సూచించారు.
ఆదివారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ప్రజా సమస్యలనే ప్రధాన అజెండాగా తీసుకుని ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీని ప్రజా సమస్యలపై పోరాట వేదికగా మార్చాలని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ భాషపై కేసీఆర్ అభ్యంతరం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, భాషపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని విమర్శించారు. అధికార పక్షం నుంచి వ్యక్తిగత విమర్శలు వచ్చినా వాటికి స్పందించకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
‘తెలంగాణ ఫాలింగ్’ అంటూ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రైజింగ్ కాదని, తెలంగాణ ఫాలింగ్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలన సరిగా సాగడం లేదని ఆరోపించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
లక్ష మంది రైతులతో ప్రాజెక్టుల సందర్శన
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించేందుకు లక్ష మంది రైతులు, కార్యకర్తలతో కలిసి ప్రాజెక్టులను సందర్శిస్తామని ప్రకటించారు. సుమారు 20 ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇదిలా ఉండగా, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశానికి హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన హాజరుపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
