న్యూఢిల్లీ: భారత అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు కేంద్ర సహాయ మంత్రి శంతను ఠాకూర్ ఘన స్వాగతం పలికారు.
పెజెష్కియాన్ రాకను స్వాగతిస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. భారత్, ఇరాన్ మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని ప్రస్తావిస్తూ.. బ్రిక్స్ భాగస్వాములుగా ఇరు దేశాలు ఉమ్మడి ప్రగతి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేస్తాయని పేర్కొంది.
సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య, ఆహ్వానిత దేశాల అధినేతలు హాజరు కానున్నారు.
వాణిజ్యం, చబహార్‌పై చర్చలు?
భారత్, ఇరాన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ సదస్సు వేదికగా ఉపయోగపడుతుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారంతో పాటు చబహార్ పోర్టు అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇటీవల కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, పెజెష్కియాన్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా పరిణామాలపై కూడా చర్చించారు.
ప్రాంతీయ సమస్యలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది భారత్ విధానమని మోదీ స్పష్టం చేశారు.
