TGN NEWS (అమీన్‌పూర్): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ సువర్ణ వ్యాలీ కాలనీవాసులు తమ కాలనీలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. కాలనీవాసులు ప్రధానంగా సి.సి. రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ నీటి సమస్యలను ప్రస్తావించారు. సరైన రోడ్లు లేకపోవడం వల్ల వర్షాకాలంలో మట్టిబురద, గుంతలు, రాకపోకలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సమీప జనప్రియ అపార్ట్‌మెంట్స్ నుండి కాలనీలోకి డ్రైనేజ్ నీరు వస్తుండటంతో చెడు వాసన, దోమల ఉత్పత్తి, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కాలనీ నాయకులు మాట్లాడుతూ,“సి.సి. రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలి. బయటి అపార్ట్‌మెంట్స్ నుండి డ్రైనేజ్ నీరు వదిలే సమస్యను ఆపాలి. ఇది ప్రాథమిక హక్కు, ఆలస్యం అసహ్యం” అని హెచ్చరించారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత కోసం శాశ్వత పరిష్కారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే “నో రోడ్స్ – నో ఓట్స్” అంటూ సంక్షిప్త హెచ్చరిక జారీ చేశారు. ఈ నిరసనలో ఆర్టీసీ సువర్ణ వ్యాలీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
