Home తెలంగాణ ఏపీకి రైల్వే బిగ్ బూస్ట్.. గూడూరు-గుమ్మిడిపూండి మధ్య నాలుగు లైన్లు

ఏపీకి రైల్వే బిగ్ బూస్ట్.. గూడూరు-గుమ్మిడిపూండి మధ్య నాలుగు లైన్లు

0

ఆంధ్రప్రదేశ్ రైల్వే కనెక్టివిటీకి కేంద్రం భారీ ఊతమిచ్చింది. గూడూరు-గుమ్మిడిపూండి మధ్య 90 కి.మీ మేర మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,229 కోట్లు.

ప్రస్తుతం డబుల్ లైన్‌గా ఉన్న ఈ మార్గం నాలుగు లైన్లుగా మారనుంది. దీంతో రైళ్ల రద్దీ తగ్గి అదనపు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు మార్గం సుగమం కానుంది. చెన్నై-కోల్‌కతా, ఢిల్లీ-చెన్నై రైల్వే కారిడార్లతో పాటు వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఈ మార్గం కీలకంగా మారనుంది.

ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. అదనపు ట్రాక్‌లతో ప్రాంతీయ అభివృద్ధి వేగం పుంజుకుంటుందని పవన్ పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారానికి కృషి చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు గురుమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.

గూడూరు జంక్షన్‌పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు చెన్నై, విజయవాడ, తిరుపతి వైపు రైళ్ల రాకపోకలు సులభతరం కానున్నాయి. పులికాట్ సరస్సు, నేలపట్టు, శ్రీహరికోట, కృష్ణపట్నం పోర్టు, శ్రీసిటీ ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.

ప్రాజెక్టులో 360 మీటర్ల స్వర్ణముఖి మెగా బ్రిడ్జితో పాటు 21 ప్రధాన, 127 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. నాలుగేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 21 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం, దాదాపు 61 లక్షల పనిదినాల ఉపాధి లభిస్తుందని అంచనా.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version