Home తెలంగాణ కాళేశ్వరంపై సీఎం సమీక్ష.. గోదావరి నీటిని ఒడిసిపట్టేలా కార్యాచరణ

కాళేశ్వరంపై సీఎం సమీక్ష.. గోదావరి నీటిని ఒడిసిపట్టేలా కార్యాచరణ

0

హైదరాబాద్‌: తెలంగాణలో సాగునీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా నీటి ఎత్తిపోతలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

నీటిపారుదల శాఖపై బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై ప్రధానంగా చర్చించారు. ఎన్‌డీఎస్ఏ సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటి నిల్వ చేయడం లేదని సీఎం గుర్తుచేశారు. భద్రతా సంస్థ మార్గదర్శకాలకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని అధికారులకు స్పష్టం చేశారు.

మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల్లో గుర్తించిన లోపాలపై ఎన్‌డీఎస్ఏతో తక్షణమే చర్చించాలని సీఎం సూచించారు. దేవాదుల ప్రాజెక్టులో తొమ్మిది పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను కీలకంగా పరిగణించాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

ఇదే సమయంలో ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతుల పరిహారం అంశంపైనా సీఎం దృష్టి సారించారు. పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాన్ని త్వరగా చెల్లించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ముంపు గ్రామాలు, పునరావాసం, పరిహారం అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు సమర్పించాల్సిందిగా సూచించారు.

బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టులను నింపేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సీఎం పేర్కొన్నారు. గట్టు, గుడెందొడ్డి ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపుపై అధ్యయనం చేయడంతో పాటు గుడెందొడ్డి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కన్సల్టెంట్‌ను నియమించాలని ఆదేశించారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version