నటి అనసూయ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్‌లో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీశాయి. ‘జై శ్రీరామ్’ పేరుతో కొందరు దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం ముసుగులో పెద్ద దొంగలు కూడా ఉన్నారంటూ అనసూయ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేయడం వివాదానికి కారణమైంది.
అనసూయ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మతపరమైన అంశాలపై మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని బీజేపీ నాయకులు సూచించారు. ఏ మతానికి చెందినవారి మనోభావాలు దెబ్బతినకుండా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అనసూయ కూడా స్పందించారు. తనను విమర్శిస్తున్న వారిపై ఘాటుగా కౌంటర్ ఇస్తూ.. ‘దొంగలంతా బయటకు వస్తున్నారు’ అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. దీంతో అనసూయ వర్సెస్ బీజేపీ నేతల వివాదం మరింత ముదిరింది.
ఈ వ్యవహారంలో పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
