Home జాతీయం డీవీఏసీ చీఫ్ అరుణ్ పై విజయ్ సర్కార్ వేటు.. సంచలనంగా మారిన బదిలీ!

డీవీఏసీ చీఫ్ అరుణ్ పై విజయ్ సర్కార్ వేటు.. సంచలనంగా మారిన బదిలీ!

0
తమిళనాడు బ్యూరోక్రసీలో పెను సంచలనం నమోదైంది. రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (డీవీఏసీ) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ. అరుణ్‌ను నియమించిన రెండు నెలల్లోనే విజయ్ ప్రభుత్వం ఆ పోస్టు నుంచి బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ర్యాంక్ అధికారిణి సి.మహేశ్వరిని డీవీఏసీ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో కొత్త చీఫ్‌గా నియమిస్తూ అడిషనల్ చీఫ్ సెక్రటరీ కె.మణివాసన్ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడీజీపీ ర్యాంక్ అధికారి అయిన అరుణ్‌ను చెన్నైలోని తమిళనాడు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పంపారు.
కోర్టు మొట్టికాయలు.. రాజకీయ వివాదాలే కారణమా?
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత మే నెల చివరి వారంలో విజయ్ ప్రభుత్వం అరుణ్‌ను డీవీఏసీ చీఫ్‌గా నియమించింది. అయితే ఈ నియామకం మొదటి నుంచి తీవ్ర వివాదాలకు దారితీసింది. గతంలో ఆయన చెన్నై పోలీస్ కమిషనర్‌గా ఉన్నప్పుడు ‘డీఎంకే అనుకూల’ అధికారిగా వ్యవహరించారంటూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న సీఎం విజయ్ పార్టీ (టీవీకే) సహా పలు పార్టీలు ఆరోపించాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పరిపాలనాపరమైన పక్షపాతం చూపించారనే ఫిర్యాదులతో ఎన్నికల సంఘం సైతం ఆయనను పక్కన పెట్టింది. ఆ తర్వాత ఆయనను ఏకంగా అవినీతి నిరోధక శాఖాధిపతిగా కూర్చోబెట్టడంపై మద్రాస్ హైకోర్టు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
మచ్చలేని చంద్రుడిలా ఉండాలి
డీవీఏసీ డైరెక్టర్ నియామకంపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు నిందలకు అతీతంగా ఉండాలి. ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖాధిపతిగా ఉండేవారు మచ్చలేని చంద్రుడిలా, ఎలాంటి అనుమానాలకు తావులేని వ్యక్తిత్వంతో ఉండాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో సి.వి. నరసింహన్, సి.ఎల్. రామకృష్ణన్ వంటి దిగ్గజాలు పనిచేసిన ఈ సీటుపై చిన్న ఆరోపణ ఉన్నా వ్యవస్థల నిజాయతీ దెబ్బతింటుందని కోర్టు గట్టిగా హెచ్చరించింది. ఈ న్యాయపరమైన ఒత్తిళ్లు, రాజకీయ విమర్శల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి విజయ్ ఈ వేగవంతమైన నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version