తెలుగుతో పాటు బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా తన కెరీర్ ఆకాంక్షలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు పూర్తి స్థాయి, హృదయాలను హత్తుకునే ఇంటెన్స్ లవ్ స్టోరీలో నటించలేదని, అలాంటి ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాలో నటించాలనే బలమైన కోరిక ఉందని వెల్లడించారు. అలాగే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పీరియడ్ డ్రామాలు లేదా హర్రర్ జోనర్‌లలో ఇప్పటివరకు భాగం కాలేదని, ఆ జోనర్లలో కూడా విభిన్నమైన ప్రయోగాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా, నటిగా తనలోని సామర్థ్యాన్ని సవాల్ చేసే స్క్రిప్ట్‌లను ఎంచుకోవడమే ఇకపై తన ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు.
ఇకపై సినిమాల విషయంలో బిగ్ బ్యానర్ లేదా జానర్ ప్రాధాన్యత కంటే, తను పోషించే పాత్రకు ఎంతవరకు ప్రాధాన్యం ఉందనేది ముఖ్యమని రకుల్ తెలిపారు. కేవలం తెరపై కనిపించడం మాత్రమే కాకుండా, నటిగా తనను మానసికంగా ఉత్తేజపరిచే మరియు కొత్తదనంతో కూడిన సవాలుతో కూడిన పాత్రలనే అంగీకరిస్తానని ఆమె స్పష్టంచేశారు.
ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’లో రకుల్ శూర్పణఖ పాత్రలో కనిపిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యష్ (రావణుడు), కాజల్ అగర్వాల్ (మండోదరి) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం మొదటి భాగం నవంబర్ 6న అంతర్జాతీయంగా విడుదల కానుంది.
