Home తెలంగాణ తహశీల్దార్ కార్యాలయంలో ఫైల్ ముందుకు కదలాలంటే లక్షల్లో ముట్టచెప్పాల్సిందేనా ?

తహశీల్దార్ కార్యాలయంలో ఫైల్ ముందుకు కదలాలంటే లక్షల్లో ముట్టచెప్పాల్సిందేనా ?

0
  • దుండిగల్ తహసీల్దార్  కార్యాలయం ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
  • భూ సమస్య పరిష్కారానికి తహసీల్దార్ 6 లక్షల లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు
  • కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చెయ్యాలని బాధితుల డిమాండ్

TGN News ( దుండిగల్ గండిమైసమ్మ ) : మండల కేంద్రమైన దుండిగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

గాగిల్లాపూర్ తాండకు చెందిన సిద్దు నాయక్ (27) అనే యువకుడు భూమి వివాదంపై తీవ్ర ఆవేదన చెంది, తహసీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతీన్ అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు చాకచక్యంగా స్పందించి అతన్ని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు సిద్దు నాయక్‌ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.

బాధితుడు సిద్దు తెలిపిన వివరాల ప్రకారం గాగిల్లాపూర్ గ్రామ సర్వే నంబర్ 148/ఇలో ఐదు గుంటలు, 150/ఇలో రెండు గుంటల భూమి తమ కుటుంబ వారసత్వమని, 2006లో ఆర్ఓఆర్ ప్రొసీడింగ్ నంబర్ 2037/06 ద్వారా భూమిని అధికారికంగా తమ పేర్లపై బదిలీ చేసుకున్నప్పటికీ పాస్ బుక్‌లు ఇవ్వకుండా తహసీల్దార్ ఆ భూమిని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రూ.6 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు సిద్దు పేర్కొన్నారు.


బాధిత కుటుంబ సభ్యులు కూడా గతంలో ఈ భూమి భూదాన్ ల్యాండ్ కాదని హైకోర్టు తీర్పుతో జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్ నంబర్లు 2023-96, 2023-97 ద్వారా నిర్ధారించారని తెలిపారు. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెవెన్యూ శాఖలో లంచం లేకుండా పేదలకు న్యాయం జరగడం లేదు అంటూ మండిపడ్డారు. తహసీల్దార్ మతీన్‌పై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన తహసీల్దార్ మతీన్ సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని పాస్ బుక్‌లు త్వరలో అందజేస్తాం అని హామీ ఇచ్చారు. సిద్దు నాయక్ సంఘటనతో రెవెన్యూ శాఖలో నెలకొన్న అవినీతి, లంచగొండితనం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అధికారులు పేదల సమస్యలను సకాలంలో పరిష్కరించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version