Home తెలంగాణ తెలంగాణలో కోటి ఓట్ల తొలగింపునకు కుట్ర: సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో కోటి ఓట్ల తొలగింపునకు కుట్ర: సీఎం రేవంత్‌ రెడ్డి

0

తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యతిరేక ఓటర్లను గుర్తించేందుకు బీజేపీ ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేసిందని విమర్శించారు. 2009 నుంచి ఓటింగ్‌ సరళిని పరిశీలించి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.

రవీంద్రభారతిలో నేడు రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవస్థ మొత్తం సిద్ధమవుతోందని అన్నారు. అందుకే ఎస్‌ఐఆర్‌ పేరుతో కొత్త కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. తెలంగాణలో కోటి ఓట్లు తొలగిస్తున్నా బీఆర్‌ఎస్‌ స్పందించడం లేదని మండిపడ్డారు.

కొడంగల్‌లో 81 వేల ఓట్లు
తన నియోజకవర్గం కొడంగల్‌లో వలస వెళ్లిన వేలాది మంది పేదల ఓట్లను తొలగిస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కొడంగల్‌లో 81 వేల ఓట్లను అనామలీస్‌ జాబితాలో చేర్చారని తెలిపారు. ప్రస్తుత ఓట్లతోనే 2029లో మోదీ ఓటమికి పునాది పడుతుందని అన్నారు.

బీజేపీ వ్యతిరేక ఓట్లు అంటే మైనార్టీలవే అనుకోవద్దని సీఎం చెప్పారు. పేదలు, గిరిజనుల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో లౌకిక శక్తులు ఏకమై మోదీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

సారంపల్లి సేవలు చిరస్మరణీయం
రైతుల కోసం జీవితాన్ని అంకితం చేసిన సారంపల్లి మల్లారెడ్డి మరణం రైతాంగానికి తీరని లోటని సీఎం అన్నారు. రైతు సమస్యలపై అవగాహన ఉన్న నాయకత్వం క్రమంగా తగ్గుతోందని పేర్కొన్నారు. కౌలు రైతులు, గిట్టుబాటు ధరలు సహా అనేక రైతు సమస్యలపై సారంపల్లికి అపారమైన అవగాహన ఉందని కొనియాడారు.

కమ్యూనిస్టు ఉద్యమాల పోరాటాల వల్లే కాంగ్రెస్‌ పలు చట్టాలు తీసుకొచ్చిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. కార్మికులు, పేదల సమస్యలపై కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు తమ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడ్డాయని చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version