Home కెరీర్ ధరణి భూ అక్రమాలపై సిట్‌కు రంగం సిద్ధం.. సమగ్ర దర్యాప్తుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

ధరణి భూ అక్రమాలపై సిట్‌కు రంగం సిద్ధం.. సమగ్ర దర్యాప్తుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

0

ధరణి పోర్టల్ ద్వారా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. పలు జిల్లాల్లో వెలుగుచూసిన భూ యాజమాన్య మార్పులు, ప్రభుత్వ భూముల అక్రమ బదిలీలు, సాంకేతిక లోపాల దుర్వినియోగం వంటి అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

సిట్‌లో రెవెన్యూ, పోలీసు, సైబర్ క్రైమ్, ఐటీ శాఖలకు చెందిన సీనియర్ అధికారులకు చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్‌లో జరిగిన సాంకేతిక మార్పులను గుర్తించడంతో పాటు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు, మధ్యవర్తులు, నెట్‌వర్క్‌ను వెలికితీయడమే ఈ బృందం ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.

2020లో ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అనుమానాస్పద భూ లావాదేవీలన్నింటినీ సిట్ పరిశీలించనుంది. మ్యుటేషన్లు, యాజమాన్య హక్కుల మార్పులు, నిషేధిత జాబితాలోని భూముల బదిలీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

ప్రాథమిక విచారణలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేలాది ఎకరాల భూముల యాజమాన్య మార్పులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల బదిలీలపై కూడా ఆరోపణలు ఉన్నాయని సమాచారం.

విచారణలో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒక జిల్లాలో జరిగిన అక్రమాలకు మరో జిల్లాతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు, ధరణి ఆపరేటర్లు, మాజీ ఆపరేటర్లు, దళారులు, మరికొందరు కీలక వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఏడాది ప్రారంభంలో యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల దారిమళ్లింపు వ్యవహారం వెలుగుచూడగా, సుమారు 4,100 లావాదేవీలను అధికారులు అనుమానాస్పదంగా గుర్తించారు. అలాగే కొన్ని జిల్లాల్లో భూముల యాజమాన్య హక్కులు అక్రమంగా మారిన కేసులు కూడా విచారణలో ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ధరణి ఆపరేటర్లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అధికారులు సమర్పించినట్లు సమాచారం. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉండగా, సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి తహసీల్దార్ సుజాతను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. భూముల పోర్టల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ 56 దస్త్రాలను ఆమోదించడం, అసైన్డ్ భూముల వారసత్వ బదిలీల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో సుమారు 448 ఎకరాల భూముల యాజమాన్య హక్కుల్లో మార్పులు జరిగినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

సిట్ ఏర్పాటు అనంతరం ధరణి పోర్టల్‌కు సంబంధించిన గత కొన్నేళ్ల భూ లావాదేవీలను సమగ్రంగా పరిశీలించి, అక్రమాలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగనున్నట్లు సమాచారం.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version