Home తెలంగాణ నగరంలో పెరుగుతున్న ఫిర్యాదులు |22(ఏ) పేరు వింటేనే హడల్‌.. వేలాది ఆస్తులపై సందిగ్ధం

నగరంలో పెరుగుతున్న ఫిర్యాదులు |22(ఏ) పేరు వింటేనే హడల్‌.. వేలాది ఆస్తులపై సందిగ్ధం

0

హైదరాబాద్‌: నగరంలో 22(ఏ) నిషేధిత ఆస్తుల జాబితా ఇప్పుడు సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఏళ్ల తరబడి తమ పేరుతో ఉన్న ఇళ్లు, స్థలాలు, ఫ్లాట్లు ఒక్కసారిగా నిషేధిత జాబితాలో చేరడంతో యజమానులు తమ హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్తి విక్రయించేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో 22(ఏ) జాబితాలో ఉందని తెలుస్తోందని బాధితులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే అడ్వాన్స్‌లు తీసుకున్న వారు లావాదేవీలు పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, శ్రీనగర్‌ కాలనీ, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, షేక్‌పేట, టోలీచౌకి తదితర ప్రాంతాల్లో ఈ సమస్యపై ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. షేక్‌పేటలోనే సుమారు 2 వేల ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్లి ఉండొచ్చని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ పరిస్థితి మారిపోయింది. గతంలో మార్కెట్‌ విలువ, రిజిస్ట్రేషన్‌ వివరాల కోసం వచ్చే ప్రజలు ఇప్పుడు తమ ఆస్తి 22(ఏ)లో ఎందుకు చేరిందో చెప్పాలని అధికారులను ప్రశ్నిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.

ఆస్తిపన్నులు చెల్లించినా, విద్యుత్‌ బిల్లులు కట్టినా, గతంలో పలుమార్లు రిజిస్ట్రేషన్లు జరిగినా.. ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చడం ఎలా సాధ్యమని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

షేక్‌పేట మండలానికి సంబంధించిన సుమారు 30 ఫిర్యాదులు కలెక్టరేట్‌ నుంచి అందాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిపారు.

ప్రైవేట్‌ ఆస్తులను తప్పుగా 22(ఏ)లో చేర్చినట్లయితే వాటిని వెంటనే తొలగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version