Home ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరుకు రైతుల నడ్డి విరుస్తోంది.. ఫ్యాక్టరీల మూసివేతకు కుట్ర: గుడివాడ అమర్‌నాథ్

ప్రభుత్వం చెరుకు రైతుల నడ్డి విరుస్తోంది.. ఫ్యాక్టరీల మూసివేతకు కుట్ర: గుడివాడ అమర్‌నాథ్

0

కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ అనే విధంగా పాలన సాగిస్తూ చెరుకు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో ఉన్న చక్కెర కర్మాగారాలను మూసివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు.

 

ఏటికొప్పాక, తాండవ, భీమసింగి వంటి సహకార చక్కెర ఫ్యాక్టరీలను మూసివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అమర్‌నాథ్ ఆరోపించారు. రైతులను ఆదుకుంటున్నామంటూ నలుగురు మంత్రులతో కమిటీ వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక సహకార చక్కెర కర్మాగారంగా నడుస్తున్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి రైతులు సుమారు రూ. 30 కోట్ల విలువైన చెరుకును సరఫరా చేసినా, ఇప్పటివరకు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు.

 

రైతులే ఈ చక్కెర పరిశ్రమలలో ప్రధాన వాటాదారులని స్పష్టం చేసిన ఆయన, సెప్టెంబర్ నాటికి చెరుకు రైతుల బకాయిలన్నింటినీ చెల్లించాలని డిమాండ్ చేశారు. చెరుకు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, చక్కెర కర్మాగారాల మనుగడ కోసం వైసీపీ తరఫున క్షేత్రస్థాయిలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version