Home ఆంధ్రప్రదేశ్ కొత్త పెన్షన్ల జారీకి ముందే కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచన

కొత్త పెన్షన్ల జారీకి ముందే కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచన

0

సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం కుటుంబాలు చిన్న చిన్న యూనిట్లుగా విడిపోవడాన్ని నిరుత్సాహపరచాలని, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలన్నింటినీ ‘ఫ్యామిలీ యూనిట్’ ప్రాతిపదికనే అమలు చేయాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ, ఆ కుటుంబానికి ఎక్కువ ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. నేడు అమరావతిలో జరిగిన 8వ కలెక్టర్ల సమావేశంలో రెండో రోజున, సూపర్-6 పథకాల అమలుపై ఆయన సమీక్ష నిర్వహించి, పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియకు ముందే రాష్ట్రవ్యాప్తంగా కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయాలని సీఎం సూచించారు. అయితే, ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులను యథాతథంగా కొనసాగించాలని స్పష్టత ఇచ్చారు. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం కుటుంబాలు విడిపోవడం సమాజానికి మంచిది కాదని, పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని అన్నారు. దీనికి అనుగుణంగానే అధికారులు కార్యాచరణ రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే అంతమందికీ తలసరి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందించేలా చూడాలని చెప్పారు.

సంక్షేమం నుంచి సాధికారత దిశగా..
రాష్ట్రంలో ఇప్పటివరకు సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయగా, అందులో రూ.75 వేల కోట్లు కేవలం పెన్షన్లకే కేటాయించినట్లు చంద్రబాబు తెలిపారు. ఆర్థిక అసమానతలను తగ్గించి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఇకపై కేవలం సంక్షేమంతో ఆగిపోకుండా, కుటుంబాలను సాధికారత వైపు నడిపించే ‘వెల్ఫేర్ టు ఎంపవరింగ్ ఫ్యామిలీస్’ విధానంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సెర్ప్, మెప్మా ద్వారా ‘వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేసి, ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించారు.

యానాటి కొండ వర్గానికి ఎస్టీ ప్రయోజనాలు
ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని యానాటి కొండ సామాజిక వర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలనే దీర్ఘకాల డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, ఒక సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, అయితే ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు వారికి అండగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.

బుడగజంగాల తరహాలోనే, యానాటి కొండ సామాజిక వర్గానికి కూడా ఎస్టీలకు వర్తించే అన్ని సంక్షేమ ప్రయోజనాలను అందించాలని తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న కాపు కార్పొరేషన్ భవనాలను వెంటనే పూర్తి చేయాలని, వక్ఫ్ ఆస్తుల ద్వారా ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version