పరిశ్రమల సహకారంతో పాఠశాలలకు నూతన భవనాలు..
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
ముత్తంగి డిఎన్ కాలనీలో రెండు కోట్ల 50 లక్షలు రూపాయలతో నిర్మించిన ఎంపిపిఎస్ పాఠశాల భవనం ప్రారంభం..
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునికరించడంతోపాటు.. నాణ్యమైన విద్యను అందిస్తూ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. విద్యారంగంలో చేపడుతున్న మార్పుల మూలంగా ప్రభుత్వ పాఠశాలలలో అడ్మిషన్లు సైతం దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. నేటి తరం తల్లితండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నెలకొని ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితులు కల్పించామని తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి దత్తాత్రేయ నగర్ కాలనీలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో రెండు కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో అధిక శాతం నిరుపేద మధ్య తరగతి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారందరికీ కార్పోరేట్ విద్యను అందించాలన్న లక్ష్యంతో ఆధునిక వసతులతో నూతన పాఠశాల భవనాలను నిర్మించడంతోపాటు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో కేజీ నుండి పీజీ వరకు అన్ని వసతులతో ప్రభుత్వ విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చిత్తశుద్ధితో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు రాబట్టాలని కోరారు. నియోజకవర్గంలో నూతన పాఠశాలల భవనాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న గ్లాండ్ ఫార్మ పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సి ఎస్ ఆర్ హెడ్ రఘురామన్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీలు స్వప్న శ్రీనివాస్, ప్రభాకర్, పిఎసిఎస్ చైర్మన్లు పాండు, బిక్షపతి, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, దశరథ రెడ్డి, ముత్తంగి మాజీ సర్పంచ్ ఉపేందర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, డిఈ సత్యనారాయణ, ఏఈ మౌనిక, నాయకులు మేరాజ్ ఖాన్, రామకృష్ణ, అంజాద్, ఆబేద్, పరిశ్రమ ప్రతినిధులు సుజాత, చైతన్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గౌరీ, తదితరులు పాల్గొన్నారు.
