Home తెలంగాణ  ఫాస్టాగ్ నుంచే ఈ-చలాన్ డబ్బులు కట్?

 ఫాస్టాగ్ నుంచే ఈ-చలాన్ డబ్బులు కట్?

0

హైదరాబాద్‌లో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కొత్త షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే ఈ-చలాన్ జరిమానాలను ఇకపై నేరుగా ఫాస్టాగ్ ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా వసూలు చేసే విధానాన్ని తీసుకురావాలని పోలీసులు ప్రతిపాదించారు.

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్ ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఫాస్టాగ్ ద్వారా చలాన్ల వసూలు విధానంపై హెచ్ఎండీఏ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అనుమతులు, సాంకేతిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాల ద్వారా గుర్తించి ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. అయితే చాలామంది వాహనదారులు జరిమానాలను వెంటనే చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారు. దీంతో బకాయి చలాన్ల వసూళ్లు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి.

ఫాస్టాగ్‌తో అనుసంధానం చేస్తే చలాన్ విధించిన తర్వాత నిర్ణీత మొత్తాన్ని నేరుగా ఖాతా నుంచి వసూలు చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. తద్వారా జరిమానాల వసూళ్లు వేగవంతం కావడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించి పూర్తి నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? చలాన్ మొత్తాన్ని ఏ విధంగా కట్ చేస్తారు? వాహనదారులకు ముందస్తుగా సమాచారం ఇస్తారా? వంటి అంశాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ఇదే సమయంలో హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు సమగ్ర పరిష్కారం అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రజా రవాణాను బలోపేతం చేయడం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ మెరుగుపరచడం, మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలు పెంచడం, అక్రమ పార్కింగ్‌ను నియంత్రించడం వంటి చర్యలు అవసరమని పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version