Home తెలంగాణ వాళ్లు-ప్రతిసవాళ్లు.. హైదరాబాద్‌లో హైటెన్షన్! 🚨 హరీష్ రావు అరెస్ట్ | BRS vs Congress |

వాళ్లు-ప్రతిసవాళ్లు.. హైదరాబాద్‌లో హైటెన్షన్! 🚨 హరీష్ రావు అరెస్ట్ | BRS vs Congress |

33
0

తెలంగాణ రాజకీయాల్లో గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. రాష్ట్ర అప్పుల అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం వీధి పోరాటానికి దారితీయడంతో హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ భవన్, గన్ పార్క్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించగా, రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.

తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కిందపడిన ఘటన అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం గన్ పార్క్ వైపు వెళ్తున్న హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

మరోవైపు మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, వాకిటి శ్రీహరి లక్ష్మణ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు గన్ పార్క్‌కు చేరుకుని తమ నిరసనను కొనసాగించారు. రెండు పార్టీల నేతలు ఒకేసారి రోడ్డెక్కడంతో రాజధానిలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది.

ఈ పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన రాజకీయ సవాల్‌ ప్రధాన కారణమైంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసరగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే స్పందించారు. “చర్చకు నేను సిద్ధం. వరంగల్ అయినా, హైదరాబాద్ అశోక్‌నగర్ అయినా ఎక్కడైనా రావచ్చు” అంటూ ఆయన ప్రతిసవాల్ విసిరారు.

అయితే కేటీఆర్‌కు సమాధానం చెప్పేందుకు సీఎం లేదా రాహుల్ గాంధీ అవసరం లేదని, తానే చర్చకు వస్తానంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. “ఎక్కడో కాదు… ఉదయం 11 గంటలకు నేరుగా తెలంగాణ భవన్‌కే వస్తున్నా. కమాన్ కేటీఆర్… కాస్కో” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.

దీంతో కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తెలంగాణ భవన్‌కు చేరుకోగా, కాంగ్రెస్ నేతలు గన్ పార్క్ వద్దకు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు నేతలను అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు.

రాష్ట్ర అప్పులు, గత ప్రభుత్వ పాలన, ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై మొదలైన రాజకీయ సవాళ్లు ఇప్పుడు వీధి పోరాటంగా మారడంతో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here