కుటుంబ కథలతో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు ఉన్న క్రేజ్, దాని బాక్సాఫీస్ లెక్కలు కూడా వేరుగా ఉంటాయి. కుటుంబ భావోద్వేగాలు, ఎంటర్‌టైన్‌మెంట్ జతకలిస్తే థియేటర్‌లు ఫ్యామిలీ ప్రేక్షకులతో కళకళలాడుతాయి. అందుకే కాబోలు గత కొంతకాలంగా ఫ్యామిలీ సినిమాలకు దూరంగా ఉన్న దర్శకులు, హీరోలు ఇప్పుడు అలాంటి సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే హీరో సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంం ఎలా ఉంది? దర్శకుడు వెంకీ అట్లూరి హీరో సూర్యకు సక్సెస్‌ఫుల్ సినిమానిచ్చాడా? ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో ప్రేక్షకులు అలరించే అంశాలున్నాయా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఓ సంపన్న వ్యాపార కుటుంబానికి చెందిన వారసుడు. ఒకవైపు బిజినెస్ చూసుకుంటూనే మరొక వైపు అమ్మ (రాధికా శరత్ కుమార్) కోరిక మేరకు రైఫిల్ షూటింగ్‌లో నైపుణ్యం సంపాందించి భారత్ తరపున ఒలింపిక్స్‌లో పాల్గొని బంగారు పతాకం గెలుస్తాడు. అయితే వివాహాం విషయంలో ఆయన మనసులో ఉన్న ఓ అభిప్రాయం కారణంగా 40 ఏండ్లు దాటినా పెళ్లి చేసుకోడు. ఆయన చిన్నప్పుడు తన ఫ్యామిలీలో జరిగిన కొన్ని సంఘటనలే అందుకు కారణం. తల్లి మాత్రం పెళ్లి చేసుకుని కుటుంబానికి వారసుడిని ఇవ్వాలని సంజయ్‌ని పదే పదే కోరుతుంది. దీంతో ఓ డాక్టర్ సలహాతో అమెరికా వెళ్లి సరోగసి ద్వారా ఓ బాలుడిని కని ఇంటికి తీసుకొస్తాడు.
అయితే అనుకోకుండా ఆ బాబు అనారోగ్యానికి గురవుతాడు. బాబు అనారోగ్యం నయం కావాలంటే కన్నతల్లి అవసరం పడుతుంది. దీంతో బాబు కన్నతల్లి గురించి అమెరికా వెళతాడు సంజయ్ విశ్వనాథ్. ఇక బాబుకు జన్మనిచ్చిన తల్లి దొరికిందా? అమెరికా నుంచి ఇండియాకు రావటానికి ఆమె ఒప్పుకుందా? ఒప్పుకుంటే ఎలా కండిషన్స్ పెట్టింది? సంజయ్ తల్లి కోరిక మేరకు పెళ్లి చేసుకున్నాడా? సంజయ్ జీవితంలో మ్యాడీ (మమిత బైజు) ఎలా వచ్చింది? ఆమె వచ్చిన తరువాత ఆయన జీవితంలో వచ్చిన మార్పులేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కుటుంబ భావోద్వేగాలతో కూడిన కథకు డీసెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి కుటుంబ మొత్తం హాయిగా కూర్చొని ఆస్వాదించే విధంగా ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. సినిమా ప్రారంభమైన తొలి సన్నివేశం నుంచే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తూ చివరి సన్నివేశం వరకు మనసుకు హత్తుకునే విధంగా ఈ సినిమాను మలిచారు దర్శకుడు వెంకీ అట్లూరి. హీరో సూర్యను ఇలాంటి స్టయిలిష్ రోల్‌లో చూసి చాలా రోజులైంది. ఆయన స్టైల్‌కు తగిన విధంగా ఓ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుని దానికి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను మేళవించిన విధానం ఎంతో ప్రశంసనీయం. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్, సరోగసి ద్వారా బిడ్డను కనడం, దానితో ముడిపడిన ఎమోషన్స్, హీరోయిన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం ఎంతో బాగుంది.






