తిరుమల: శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించే బంగారు కానుకల నిర్వహణకు సంబంధించి టీటీడీ కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తోంది. హుండీలో లభించే బంగారాన్ని నేరుగా విక్రయించకుండా బంగారు బిస్కెట్లుగా మార్చి బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్‌గా ఉంచాలని యోచిస్తోంది. ఆలయ అవసరాల కోసం భవిష్యత్తులో ఈ బంగారాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు.
భక్తులు మొక్కుల సమయంలో బంగారు నగలు, వస్తువులను శ్రీవారి హుండీలో సమర్పిస్తుంటారు. ఈ కానుకలను దీర్ఘకాలికంగా భద్రపరచడంతో పాటు వాటి ద్వారా ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ భావిస్తోంది. బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీ ఆదాయం పొందడంతో పాటు అవసరమైనప్పుడు ఆలయ ఆభరణాల తయారీకి ఉపయోగించుకోవచ్చని
రత్నాలకు వేలం?
బంగారు ఆభరణాల్లో ఉన్న వజ్రాలు, రత్నాలు, ఇతర విలువైన రాళ్లను వేరు చేసి వేలం వేయాలని మరో ప్రతిపాదన ఉంది. వేలం ద్వారా వచ్చిన మొత్తంతో తిరిగి బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి బ్యాంకుల్లో జమ చేయాలని భావిస్తున్నారు. అంటే హుండీ ద్వారా వచ్చిన సంపదను నగదు రూపంలో కాకుండా బంగారం రూపంలో నిల్వ చేయాలన్నది ప్రతిపాదన సారాంశం.
నిపుణుల కమిటీ పర్యవేక్షణ
వేలం వేయనున్న ఆభరణాల విలువను టీటీడీ అప్రైజర్లు, జమాలజిస్టులు, ప్రభుత్వ మింట్ నిపుణులు కలిసి అంచనా వేయనున్నారు. జువెలరీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తర్వాత రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన కమిటీ పర్యవేక్షణలో ఏడాదికి ఒకసారి వేలం నిర్వహించేలా నిబంధనలు రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
చట్టపరమైన స్పష్టత అవసరం
అయితే భక్తులు స్వామివారికి సమర్పించిన ఆభరణాల్లోని రత్నాలు, విలువైన రాళ్లను వేలం వేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భక్తుల విశ్వాసంతో సమర్పించిన కానుకల వినియోగంపై మరింత స్పష్టత అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం ఆమోదం, చట్టపరమైన పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే టీటీడీ నిబంధనల ప్రకారం భక్తులు సమర్పించే కొన్ని వస్తువులను వేలం వేస్తోంది. అయితే హుండీ బంగారాన్ని విక్రయించకుండా డిపాజిట్ చేయడం, రత్నాలను వేరు చేసి వేలం వేయడం వంటి అంశాల్లో కొత్త విధానం అమలులోకి రావాలంటే తుది ఆమోదం అవసరం.
