Home తెలంగాణ వైభవంగా ఘటాల ఊరేగింపు.. జనసంద్రంగా మారిన లాల్‌దర్వాజ

వైభవంగా ఘటాల ఊరేగింపు.. జనసంద్రంగా మారిన లాల్‌దర్వాజ

48
0

హైదరాబాద్‌: చారిత్రాత్మక లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం ఘటాల, అంబారీ ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి ఊరేగింపును తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ప్రధాన మార్గం జనసంద్రంగా మారింది.

ఊరేగింపులో ఫలహారం బండ్లకు పొట్టేళ్లను కట్టి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లాల్‌దర్వాజ అధికారిక పోతరాజు అశ్విన్‌ ముదిరాజ్‌ తన ప్రదర్శనతో భక్తులను అలరించారు. వివిధ దేవతామూర్తుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఊరేగింపునకు మరింత శోభను తీసుకొచ్చాయి.

పచ్చికుండపై మాతంగి అనురాధ భవిష్యవాణి

లాల్‌దర్వాజ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పచ్చికుండపై నిల్చొని మాతంగి అనురాధ రంగం నిర్వహించారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో చేసే పూజల వల్లే దేశం సుభిక్షంగా ఉంటోందని ఆమె పేర్కొన్నారు. లాల్‌దర్వాజ ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు.

కాలికాలం కారణంగా అనుకోని ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ముఖ్యంగా చిన్నారులపై దారుణాలు పెరుగుతున్నాయని మాతంగి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామగ్రామాన తాను కొలువై ఉన్నానని, అందుకే ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

చార్మినార్‌ మీదుగా ఘనంగా ఊరేగింపు

ఉప్పుగూడ, ఛత్రినాక, గౌలిపుర, లాల్‌దర్వాజ మోడ్‌ మీదుగా చార్మినార్‌, నయాపూల్‌, ఢిల్లీ దర్వాజ వరకు ఘటాల ఊరేగింపు కొనసాగింది. దారిపొడవునా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉప్పుగూడలో టిల్లు తల్వార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫలహారం బండిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించుకున్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here