Home రాజకీయం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశాలు

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశాలు

0

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని జారీ చేసిన ఆదేశాలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కోలుకోలేని గొడ్డలిపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి, నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు. ఎల్‌నినో పేరు చెప్పి కేఆర్ఎంబీ తెలంగాణ హక్కులను కాలరాస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరుమెదపకపోవడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నిబంధనల ప్రకారం, ఏ హక్కుతో వెలిగొండ ప్రాజెక్టుకు చట్టవిరుద్ధంగా నీటిని తరలిస్తోందో చెప్పాలని నిలదీసిన కేటీఆర్, ఏపీ నీటి దోపిడీ బోర్డు కళ్లకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

 

అక్కడ ఏపీ ప్రభుత్వం తన రాష్ట్ర ప్రయోజనాల కోసం దర్జాగా వెలిగొండకు నీటిని తరలిస్తుంటే, ఇక్కడ తెలంగాణలోని రేవంత్ సర్కార్ మాత్రం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులను మూసివేసి ఏపీకి సహకరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన అసమర్థ పాలనతో శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లను ఏపీకి దారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తే నాగార్జున సాగర్ ఎడమ కాలువ, కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాల కింద రైతుల పొలాలు ఎండిపోవడమే కాకుండా, బోర్ల కింద వ్యవసాయం చేసే రైతులకు కరెంట్ అందక తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

శ్రీశైలంలో ఆగస్టు 21న 169 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వలు కేవలం 15 రోజుల్లోనే 139 టీఎంసీలకు పడిపోవడంపై స్పందిస్తూ, ఈ వ్యవధిలోనే 30 టీఎంసీల నీరు ఎలా మాయమయ్యిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి వద్ద కేవలం మూడు మోటార్లు మాత్రమే నడుస్తున్నాయని, కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తరలిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం కరవైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, రైతాంగానికి చేస్తున్న ద్రోహాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి తీరతామని కేటీఆర్ హెచ్చరించారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version