సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. అదే సమయంలో చాలా ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఐఎండీ అంచనాల ప్రకారం.. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) వర్షపాతం 91 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశముంది. సాధారణంగా ఈ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 167.9 మిల్లీమీటర్లుగా ఉంటుంది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అయితే వాయవ్య, ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు.. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో వేడి, ఉక్కపోత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది.
పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న బలమైన ఎల్ నినో పరిస్థితుల ప్రభావమే వర్షపాతం తగ్గడానికి, ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణమని ఐఎండీ వివరించింది. ఈ పరిస్థితులు మున్ముందు మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.
తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయం, జలవనరులు, జలవిద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని ఐఎండీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని, రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండే ఈశాన్య రుతుపవనాలపై ప్రత్యేక అంచనాలను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ఐఎండీ తెలిపింది.






