0

కలియుగ వైకుంఠంలో భక్తి అద్భుతం.. 116 ఏళ్ల నవనీతమ్మకు శ్రీవారి ప్రత్యేక దర్శనం!

వయసు 116 ఏళ్లు.. అడుగులు నెమ్మదిగానే ఉన్నా, మనసులో మాత్రం వెంకన్న దర్శనం కోసం అపారమైన తపన. తమిళనాడుకు చెందిన నవనీతమ్మ శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించిన ఘటన భక్తులను కదిలించింది.

“గోవిందా.. గోవిందా..” అంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ కొండ ఎక్కుతున్న ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వయసులోనూ శ్రీవారి దర్శనం కోసం ఆమె చూపిన అచంచల భక్తి టీటీడీ చైర్మన్ దృష్టికి చేరింది.

వెంటనే స్పందించిన చైర్మన్, నవనీతమ్మ వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఆమెకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆమెను తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో బంధువుల ఇంట్లో గుర్తించారు.

టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లతో నవనీతమ్మను తిరుమలకు తీసుకువచ్చారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో బయోమెట్రిక్ మార్గం ద్వారా ఆలయంలోకి సులభంగా ప్రవేశం కల్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆమె మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం అర్చకులు, టీటీడీ అధికారులు నవనీతమ్మకు తీర్థప్రసాదాలు అందజేశారు. 116 ఏళ్ల వయసులోనూ వెంకన్నపై ఆమె చూపిన విశ్వాసం, పట్టుదల భక్తులకు స్ఫూర్తిగా నిలిచింది.

 

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version