హైదరాబాద్: 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం భారీగా సన్నద్ధమవుతోంది. పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.1000 కోట్లు కేటాయించినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
- ఆగస్టు నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
- సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభించాలి.
- రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాలకు ప్రత్యేక అధికారుల నియామకం.
- కీలక ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు.
- పనుల పురోగతిపై దేవాదాయ శాఖ ప్రత్యేక డాష్‌బోర్డ్.
- భక్తుల రవాణాకు ఇబ్బందులు లేకుండా రహదారుల అనుసంధానం.
- స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీల భాగస్వామ్యం.
- స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలను ముందుగానే గుర్తించాలి.
పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు హెచ్చరించారు.
