Home క్రైం లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.

లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.

13
0

హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ ప్రాంతంలో ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక 25 ఏళ్ల యువ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది. లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణం చెల్లింపులో జాప్యం కావడంతో నిర్వాహకులు నిరంతరం ఒత్తిడి, వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు మరో ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఓ యువ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మృతురాలు శివ దానపు దేవనందిని (25) స్వస్థలం కృష్ణా జిల్లా గణపవరం గ్రామం. 2022 నవంబర్ 8న పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన తిరుమల రేవంత్ కుమార్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం దంపతులు హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ పరిధిలో ఉన్న జేజే నగర్‌లోని SSB క్లాసిక్ అపార్ట్‌మెంట్లో గత మూడు సంవత్సరాలుగా నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ఉదయం సుమారు 10 గంటల సమయంలో రేవంత్ కుమార్ పనిమీద బయటకు వెళ్లాడు. అనంతరం పలుమార్లు భార్యకు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో ఆందోళన చెందిన అతను ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని దేవనందిని వేలాడుతూ కనిపించింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి మొబైల్ ఫోన్‌ను పరిశీలించారు. ప్రాథమిక విచారణలో దేవనందిని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు, ఆ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు నిరంతరం ఒత్తిడి, వేధింపులకు గురిచేసినట్లు గుర్తించారు. ఈ మానసిక ఒత్తిడిని భరించలేక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రి భీమవరపు వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోన్ యాప్ నిర్వాహకుల పాత్ర, వేధింపుల స్వరూపంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here