తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాల కంటే తేలికపాటి నుంచి మోస్తరు జల్లులే ఎక్కువగా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు రాబోయే 48 గంటల్లో మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలపై ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. జూలై 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించింది.




