విద్యే మనిషి జీవితాన్ని మార్చే శక్తి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చదువుకు దూరమైతే ఆస్తి ఉన్నా సామాజికంగా వెనుకబడే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చుతున్నామని అసెంబ్లీలో తెలిపారు.
విద్యా వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ప్రత్యేక విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించేందుకు కేశవరావు కమిటీని నియమించామని చెప్పారు.
రాష్ట్రంలోని 28,163 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 28.77 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని సీఎం తెలిపారు. వీరికి 1.57 లక్షల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారని వెల్లడించారు.
టీచర్ నియామకాల్లో తమ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏడాదిలోనే 11 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, 55 రోజుల్లో 10,600 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించామని తెలిపారు.
విద్యా బడ్జెట్‌ను పెంచుతున్నామని, తెలంగాణ విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తయారు చేయడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.






