Home తెలంగాణ దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం.. నేడు తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం.. ఇవే ప్రత్యేకతలు!

దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం.. నేడు తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం.. ఇవే ప్రత్యేకతలు!

15
0

భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి నేడు శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానాలో ప్రారంభించనున్నారు. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ రైలు జింద్–సోనిపట్ మార్గంలో సేవలు ప్రారంభించనుంది. పర్యావరణ హిత రవాణాకు ఇది కొత్త దిశగా నిలవనుందని రైల్వే శాఖ భావిస్తోంది.

ప్రధాని మోదీ నేడు హర్యానా, పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మొత్తం రూ.26,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో నిర్వహించే కార్యక్రమంలో తొలి హైడ్రోజన్ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు.

కాలుష్యరహిత ప్రయాణానికి నాంది

హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ రైలు నుంచి హానికరమైన పొగ లేదా కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. దీంతో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషించనుంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే దిశగా భారతీయ రైల్వే చర్యలు చేపడుతోంది.

ఇతర అభివృద్ధి కార్యక్రమాలు

హర్యానా పర్యటనలో భాగంగా కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం చండీగఢ్‌లో రూ.6,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పీజీఐఎంఈఆర్‌లో కొత్త వైద్య కేంద్రాలను ప్రారంభించడంతో పాటు ఢిల్లీ–అమృత్‌సర్–కత్రా ఎక్స్‌ప్రెస్ హైవేను జాతికి అంకితం చేయనున్నారు.

అదే సమయంలో దేశవ్యాప్తంగా 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి, రాయనపాడు, కంబం రైల్వే స్టేషన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే కర్టోలి–అంబాలా, అమృత్‌సర్ (ఛెహర్తా)–వారణాసి మధ్య రెండు కొత్త రైలు సర్వీసులకు కూడా పచ్చజెండా ఊపనున్నారు.

హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు

  • జింద్–సోనిపట్ మార్గంలో ప్రతిరోజూ రెండు రౌండ్ ట్రిప్పులు నిర్వహిస్తుంది.
  • రోజుకు సుమారు 356 కిలోమీటర్ల మేర సేవలు అందిస్తుంది.
  • గంటకు 75 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది.
  • మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. ఇందులో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది ప్రయాణికుల కోచ్‌లు ఉన్నాయి.
  • ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
  • కోచ్‌లు ఆధునిక సౌకర్యాలతో రూపొందించబడినప్పటికీ, ఇవన్నీ నాన్-ఏసీ కోచ్‌లే.
  • జింద్ సిటీ, పాండు పిండార, లలిత్ ఖేరా, భంబేవా, ఇషాపూర్ ఖేరీ, బుటానా, ఖండ్రాయ్, గోహనా, రభ్ర, లాత్, మోహనా, బర్వాస్ని, సోనిపట్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలు

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికే హైడ్రోజన్ రైళ్లు సేవలందిస్తున్నప్పటికీ, ఇంత పొడవైన హైడ్రోజన్ రైలును ప్రవేశపెడుతున్న తొలి దేశంగా భారత్ నిలవనుంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఈ ప్రాజెక్టు భారత రైల్వే రంగంలో గ్రీన్ టెక్నాలజీకి నాంది పలుకుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here