మేడ్చల్: మేడ్చల్‌లో దెబ్బతిన్న రోడ్ల సమస్యపై బీఆర్ఎస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపై ఏర్పడిన భారీ గుంతల్లో వరి నాట్లు వేసి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు.
మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 297వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో రోడ్లు పూర్తిగా దెబ్బతిని, గుంతలు ఏర్పడటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. వర్షాల కారణంగా పరిస్థితి మరింత దిగజారిందని, ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్ల గుంతల్లో వరి నాట్లు వేసి తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు.. మేడ్చల్ మున్సిపాలిటీని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేసినప్పటికీ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రోడ్ల దుస్థితిపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి, గుంతలను పూడ్చడంతో పాటు స్థానికుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.




