Home తెలంగాణ Bigg Boss Telugu 10: బిగ్ బాస్ ఛాన్స్ కోసం 270 కి.మీ పాదయాత్ర.. ఆటో...

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ ఛాన్స్ కోసం 270 కి.మీ పాదయాత్ర.. ఆటో డ్రైవర్ వినూత్న ప్రయత్నం!

47
0

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మరోసారి సిద్ధమవుతున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషల్లో ఈ రియాలిటీ షో కొనసాగుతోంది. తెలుగులో ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు పదో సీజన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 10లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు, సామాన్యులకు కూడా అవకాశం కల్పించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ‘అగ్ని పరీక్ష’ ఆడిషన్స్‌ కూడా ప్రారంభమైనట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాలనే తన కలను నెరవేర్చుకునేందుకు మంచిర్యాలకు చెందిన ఓ ఆటో డ్రైవర్ వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. తనకు బిగ్ బాస్‌లో అవకాశం కల్పించాలంటూ ఏకంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన తుడుం నాగార్జున ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బిగ్ బాస్ షోలో పాల్గొనాలన్న తన కోరికను నెరవేర్చుకునేందుకు కవ్వాల్ గ్రామం నుంచి హైదరాబాద్‌ వరకు పాదయాత్ర ప్రారంభించాడు. ఈ నెల 17న మొదలైన అతని పాదయాత్ర ప్రస్తుతం మంచిర్యాల జిల్లాను దాటి కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్, నాగార్జున పేర్లతో కూడిన ఫ్లెక్సీని పట్టుకుని రోడ్డుపై నడుస్తున్న అతడిని చూసిన పలువురు స్థానికులు ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా బిగ్ బాస్‌లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. ఎన్నిసార్లు విఫలమైనా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపబోనని చెప్పాడు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 10 ‘అగ్ని పరీక్ష’కు దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించాడు.

వివిధ రంగాల్లో ప్రతిభ ఉన్నవారికి బిగ్ బాస్‌లో అవకాశం కల్పిస్తున్నారని, ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న తనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని నాగార్జున కోరుతున్నాడు.

హైదరాబాద్‌ వరకు దాదాపు 270 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ.. తన కల కోసం ఆ దూరాన్ని లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్నాడు. మరి నాగార్జున కల నెరవేరి బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 10లో అవకాశం దక్కుతుందా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here