Home తెలంగాణ Breaking : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం

Breaking : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం

11
0

హైదరాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. 52 ఏళ్ల వయసులో శుక్రవారం తెల్లవారుజామున 12:51 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం), ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు.

జూలై 26న హనుమకొండలో ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమించి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులు అధికారికంగా ధృవీకరించారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నాయకుల్లో ఒకరు. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించిన ఆయన, 2001లో టీఆర్‌ఎస్‌లో చేరి జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం జిల్లా పార్టీ కన్వీనర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. అనంతరం తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావుకు అత్యంత సన్నిహితుడిగా, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆయన మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, నర్సంపేట ప్రజలు, తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రజాసేవలో ఆయన చేసిన కృషిని కొనియాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here