భారత యువత ఆదాయం సంపాదించే విధానంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. క్లియర్‌ట్యాక్స్ విడుదల చేసిన తాజా విశ్లేషణ ప్రకారం, 25 ఏళ్లలోపు పన్ను చెల్లింపుదారుల్లో 76 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులను ప్రకటిస్తున్నారు. 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 14 శాతం మాత్రమే ఉండటం విశేషం.
యువత జీతంతో పాటు షేర్లలో పెట్టుబడులు, స్టాక్ ట్రేడింగ్, ఫ్రీలాన్సింగ్, సొంత వ్యాపారాలు వంటి మార్గాల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు. సంపద సృష్టిపై యువత దృష్టి పెరుగుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఈ ధోరణి యువతకే పరిమితం కాలేదు. మొత్తం పన్ను చెల్లింపుదారుల్లో 39 శాతం మంది క్యాపిటల్ గెయిన్స్‌ను ఆదాయంగా చూపించారు. నాలుగేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 9 శాతం మాత్రమే. అలాగే 26 శాతం మంది వ్యాపార ఆదాయాన్ని ప్రకటించగా, 2022-23లో ఇది కేవలం 4 శాతం మాత్రమే ఉంది.
ఫ్రీలాన్సింగ్, కన్సల్టింగ్, కంటెంట్ క్రియేషన్, స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో జీతం ఒక్కటే ఆదాయ మార్గం అనే పరిస్థితి క్రమంగా మారుతోంది.
ఇక ఈ ఏడాది క్లియర్‌ట్యాక్స్ ద్వారా దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నుల్లో కేవలం జీతాన్నే ఆదాయంగా చూపిన వారి వాటా 42 శాతానికి పడిపోయింది. నాలుగేళ్ల క్రితం ఇది 82 శాతం ఉండేది.
సీనియర్ సిటిజన్లలోనూ 53 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు కలిగి ఉండగా, రూ.20 లక్షలకు పైగా స్థూల ఆదాయం ప్రకటించిన వారి వాటా 22 శాతం నుంచి 32 శాతానికి పెరిగింది. పెట్టుబడులు, వ్యాపారాలు, అదనపు ఆదాయ మార్గాలపై భారతీయులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.





