హైదరాబాద్ వాసులకు నీటి సరఫరా అత్యంత కీలకం. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు రోజు విడిచి రోజు వచ్చే తాగునీటిపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 17) నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన పంపింగ్ మెయిన్ జంక్షన్, గ్రావిటీ మెయిన్‌కు ఎంఎస్–పీఎస్సీ పైపుల అనుసంధానం, పెద్దాపూర్ క్యాంపస్‌లోని ఫేజ్–4 పంప్‌హౌస్‌లో వాల్వుల మార్పిడి పనులు చేపట్టనున్నారు. ఈ పనుల కారణంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది.
పనులు పూర్తయ్యే వరకు ఆయా ప్రాంతాల ప్రజలు నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. పనులు పూర్తైన అనంతరం నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు మెట్రో వాటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.






