గుండ్లపోచంపల్లి: మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌లో కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి పనులు, అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ రైల్వే ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నిర్మాణ నాణ్యత, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రైల్వే నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఈటల రాజేందర్ అధికారులకు సూచించారు. పనుల విషయంలో ఎలాంటి రాజీకి తావులేకుండా నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. పనుల ఆలస్యం కారణంగా స్థానికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
గుండ్లపోచంపల్లి, పరిసర ప్రాంతాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా పనులను వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఎంపీ ఆదేశించారు. ముఖ్యంగా అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అండర్‌పాస్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే గుండ్లపోచంపల్లి, పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకల పరంగా గణనీయమైన ఉపశమనం లభిస్తుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యం, రాకపోకల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కావేరీ శ్రీధర్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్, జైతువాలా కిషన్, మలిగే అశోక్, వెంకటేష్ గౌడ్, ముక్కిడిగల్ల మహేష్, ఎస్. నవీన్, అభిలాష్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైల్వే అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






