ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన భారీ క్షిపణి దాడుల్లో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
సుదర్శన్ గౌడ్ ఉపాధి కోసం సుమారు నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్ వెళ్లారు. అంతకుముందు స్వగ్రామంలో షట్టరింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు.
మంగళవారం ఉదయం రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు జరిపింది. ఈ సమయంలో సుదర్శన్ తాను నివసిస్తున్న గది నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో జరిగిన క్షిపణి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ దాడుల్లో సుదర్శన్ గౌడ్‌తో పాటు మరో 11 మంది కూడా మరణించినట్లు సమాచారం. ఉక్రెయిన్‌లోనే ఉంటున్న సమీప తాటిపల్లి గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తి ద్వారా సుదర్శన్ మరణవార్త కుటుంబ సభ్యులకు చేరింది.
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తమ ఆప్తుడు యుద్ధానికి బలికావడంతో హస్నాబాద్‌లోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






