తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు ప్రారంభంలోనే రాజకీయ వేడి రాజుకుంది. కేసీఆర్ ఫాంహౌస్ వద్ద చోటుచేసుకున్న ‘శుద్ధి’ ఘటనను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సభలో ప్రస్తావించడంతో బీఆర్‌ఎస్ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ వద్ద కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేతలు, దళిత సంఘాలు నిరసన తెలిపిన అనంతరం ఆ ప్రాంతాన్ని బీఆర్‌ఎస్ నేతలు శుద్ధి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సభలో తీవ్రస్థాయిలో స్పందించారు.
దళితులు నిరసన తెలిపిన ప్రాంతాన్ని శుద్ధి చేయడం కుల వివక్షకు నిదర్శనమని మంత్రి ఆరోపించారు. ఇది దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించే చర్యగా అభివర్ణించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అసెంబ్లీ గేటు వద్ద దూషించిన ఘటనను కూడా ఆయన ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు.
మంత్రి వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. వెల్‌లోకి దూసుకొచ్చిన ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన అనుచిత ప్రవర్తనపై తక్షణమే స్పందించాలని కోరారు.
దీంతో సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య నినాదాల పోరు కొనసాగింది. ఒకవైపు ‘శుద్ధి’ వ్యవహారంపై చర్చకు మంత్రి పట్టుబట్టగా, మరోవైపు మహిళా ఎమ్మెల్యేల అంశంపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ సభ్యులు డిమాండ్ చేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.






