Home తెలంగాణ సనత్‌నగర్‌ టిమ్స్‌కు మోక్షమెప్పుడో..? గడువులు మారుతున్నా ప్రారంభం మాత్రం దూరమే!

సనత్‌నగర్‌ టిమ్స్‌కు మోక్షమెప్పుడో..? గడువులు మారుతున్నా ప్రారంభం మాత్రం దూరమే!

68
0

హైదరాబాద్‌లో పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో టిమ్స్‌ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

సనత్‌నగర్‌లో నిర్మితమవుతున్న 1,000 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు బీఆర్‌ఎస్‌ హయాంలోనే 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పేదల ఆరోగ్యంపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఆసుపత్రి ప్రారంభోత్సవం విషయంలో ప్రభుత్వం పలుమార్లు గడువులు ప్రకటించినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. గతేడాది డిసెంబర్‌ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా టిమ్స్‌ను ప్రారంభిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఆ హామీ అమలు కాలేదు. అనంతరం సంక్రాంతి లక్ష్యంగా పెట్టుకున్నా పనులు పూర్తికాకపోవడంతో గడువును ఉగాదికి మార్చారు. అయినప్పటికీ ప్రారంభం జరగలేదు.

ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌తో పాటు ఇతర ప్రభుత్వ దవాఖానలపై రోగుల భారం గణనీయంగా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ వరుస వాయిదాలతో సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభం “మూడు గడువులు.. ఆరు వాయిదాలు” అన్నట్టుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం టిమ్స్‌ సనత్‌నగర్‌ ప్రారంభోత్సవానికి మరో కొత్త తేదీ ఖరారైనట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు ఉండటంతో ప్రారంభోత్సవాన్ని ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈసారి అయినా ఆసుపత్రి తలుపులు ప్రజలకు తెరుచుకుంటాయా లేదా అన్నది వేచిచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here