Home ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్..

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్..

0

వైద్య సేవల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని విస్తరించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మదుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినే రెటినోపతి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి రోగులకు సకాలంలో చికిత్స అందించేందుకు ఏఐ ఆధారిత స్క్రీనింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతోంది. గుంటూరు, కర్నూలు, విశాఖలోని ప్రభుత్వాసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంటి వైద్యుల కొరత ఉన్న ప్రాంతాల్లోనూ రోగులను ముందుగానే గుర్తించి చికిత్సకు పంపించే అవకాశం ఈ వ్యవస్థ ద్వారా లభించనుంది.ప్రస్తుతం రెటినోపతి నిర్ధారణ కోసం ఫండస్ కెమెరాలతో తీసిన చిత్రాలను కంటి వైద్య నిపుణులు పరిశీలించి చికిత్స నిర్ణయిస్తున్నారు. అయితే ఏఐ అందుబాటులోకి రావడంతో ఫండస్ కెమెరాతో తీసిన ఇమేజ్‌ను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేస్తే, రెటినోపతి ఉందా లేదా, ఉంటే ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని క్షణాల్లో విశ్లేషించి నివేదిక ఇస్తుంది. వైద్యుడు లేకున్నా ప్రాథమిక స్థాయిలో సమస్యను గుర్తించి రోగిని అప్రమత్తం చేసే అవకాశం కలుగుతుంది. దీంతో చికిత్స ఆలస్యం కావడం, సమస్య ముదరడం వంటి పరిస్థితులను గణనీయంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారుమదుమేహంతో బాధపడుతున్న వారిలో ఎక్కువ శాతం మంది రెటినోపతి సమస్యలకు గురవుతున్నారు. కంటి చూపు మందగించడం, నరాలు దెబ్బతినడం, రెటీనా పొర విడిపోవడం వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది రోగులు సమస్య ముదిరిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తుండటంతో శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి నెలకు వచ్చే మదుమేహ రోగుల్లో 15 నుంచి 20 శాతం మంది వరకు రెటినోపతి లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు స్క్రీనింగ్ వ్యవస్థ అవసరం మరింత పెరిగింది.కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ ఎయిమ్స్, ఎయిమ్స్-రిషికేశ్ సంస్థల సహకారంతో వాద్వాని సంస్థ రూపొందించిన ‘మధునేత్ర’ ఏఐ సొల్యూషన్ ఇప్పటికే మంచి ఫలితాలు ఇస్తోంది. దాదాపు 13 వేల మంది రెటినోపతి రోగుల వివరాలతో ఈ ఏఐ వ్యవస్థకు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలోని 45 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ సేవలు వినియోగంలో ఉన్నాయి. అదే నమూనాను రాష్ట్రంలో అమలు చేస్తూ గుంటూరు, కర్నూలు, విశాఖలో మూడు నెలల పాటు పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version